‘గీతా సుబ్రమణ్యం’ వెబ్ సిరీస్‌తో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ కృష్ణ తన్నీరు, ఇప్పుడు హీరోగా ‘ఎ కప్ ఆఫ్ టీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేటి యువతకు నచ్చే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఎఫ్పీ రోజర్స్, నిఖిత రావు దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఆర్టిస్ట్ క్రియేషన్స్ పతాకంపై మనోజ్ కృష్ణ, నవీన్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా, ఈ మూవీ నుండి ‘వాట్ హాపెండ్’ (What Happened) అనే ప్రమోషనల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. డైస్ ఆర్ట్స్ ఫిల్మ్స్ ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది.
హీరో మనోజ్ కృష్ణ మాట్లాడుతూ…”మా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి మేము ఎంచుకున్న మార్గమే ఈ ప్రమోషనల్ సాంగ్. పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నది ఈ పాటలో ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాం. ఈ పాటతో మా సినిమాని ప్రమోట్ చేసి థియేటర్స్ వరకూ తీసుకెళ్లాలన్నదే మా ఉద్దేశ్యం. ఈ సినిమా ఒక యంగ్‌స్టర్ జర్నీ. ఒక కాలేజ్ యువకుడి ప్రయాణం ఎలా మొదలవుతుంది, అది ఎలా దారి తప్పుతుంది (డీవియేట్), దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అన్నది ఈ సినిమాలో చూపించాం. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా. ‘గీత సుబ్రమణ్యం’ తర్వాత మళ్లీ నాకు అంత హై ఇచ్చిన ఫిల్మ్ ఇది. మా టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త్వరలోనే మీడియా వారికి ఒక ప్రీవ్యూ ప్లాన్ చేస్తున్నాం. హీరోయిన్ జయశ్రీ చాలా బాగా చేసింది,” అన్నారు. ఈ చిత్రంలో జయ శ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, నటుడు రాకేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.