Alla Ramakrishna Reddy: ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే ప్రకటించిన విషయం విదితమే.. తన రాజీనామాకు గల కారణాలను త్వరలో పూర్తిగా తెలియజేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు ఆర్కే.. వైఎస్ షర్మిలతోనే నా రాజకీయ ప్రయాణం అని స్పష్టం చేశారు.. వైఎస్ షర్మిల రాజకీయాలపై తన నిర్ణయం ప్రకటించాక ఆమె వెంటే నడుస్తా అన్నారు.. ఇక, నా నియజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్త చేశారు.. కానీ, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా చంద్రబాబు, లోకేష్‌పై కేసులు వేస్తానన్న ఆయన.. చంద్రబాబు లాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఏవైనా తప్పులు చేస్తే అవసరమైతే వారిపై కూడా కేసులు వేస్తాను అంటూ హాట్ కామెంట్లు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళగిరి అభివృద్ధికి 12 వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే అందరం ఆనందించాం.. కరోనా ఇబ్బందులతో ఒత్తిడి చేయలేకపోయాను అన్నారు ఆర్కే.. ఆ తర్వాత రూ.500 కోట్లకు కుదించారు.. మళ్లీ దానాని రూ.300 కోట్లకు కుదించి.. ఆ తర్వాత నూటాపతిక కోట్లకు కుదించారు.. కానీ, ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా రాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీకి నేను ఎంత సేవచేశాను.. కానీ, నన్ను వైఎస్ జగన్ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి, కుప్పం, గాజువాక, భీమవరం ఇలాంటి నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలి అంటే.. ఆ నియోజకవర్గాల్లో ఎంతో అభివృద్ధి చేయాలో అంత స్థాయిలో చేయలేదు.. మరి ఎలా గెలిపిస్తారు? అని ప్రశ్నించారు. మంగళగిరిలో వందల కోట్లు అప్పులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఒక రూపాయి కూడా నిధులు కేటాయించలేదు అన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.
నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిని.. రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలను అభిమానించే వ్యక్తిని.. నా రాజకీయ ప్రయాణం షర్మిలతోనే అని స్పష్టం చేశారు ఆర్కే.. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే నేను ఉంటా.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ పార్టీని బలోపేతం చేయడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను అన్నారు. నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను.. మంత్రి పదవి ఇవ్వలేదని రాజీనామా చేయాలనుకుంటే రెండేళ్ల క్రితం రాజీనామా చేసేవాడ్ని కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 175 సీట్లు గెలుస్తానంటున్న ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో చేస్తున్న అభివృద్ధి ఏంటో చెప్పాలి..? అని నిలదీశారు. కుప్పం, పులివెందుల నియోజకవర్గాలను టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం మిగతా నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు.
1200 కోట్లు మంగళగిరి అభివృద్ధికి కేటాయిస్తానన్న ముఖ్యమంత్రి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు ఆర్కే.. మంగళగిరి అభివృద్ధిలో ప్రభుత్వ సహకారం లేదు.. ఎన్నిసార్లు సీఎంవో చుట్టూ తిరిగిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంవోలో అధికారులు, ఎమ్మెల్యేలను పురుగులు చూసినట్టు చూస్తున్నారు.. అలాంటి పార్టీలో నేను ఎందుకు ఉండాలన్న ఆలోచనతోనే రాజీనామా చేశాను అన్నారు. ఎమ్మెల్యే పదవికే కాదు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను… నాకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నా రాజీనామా ఆమోదిస్తారా లేదా అన్నది స్పీకర్ విచక్షణ అధికారం. నేను మాత్రం నైతికత పాటిస్తూ ఎమ్మెల్యేగా ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై పాల్గొనబోనని స్పష్టం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. కాగా, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్కే కు అసెంబ్లీ సీట్లు లేదనే సమాచారంతో.. ముందే ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి పొలిటికల్ హీట్ పెంచారు. ఇక, ఎన్టీవీతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..