NTV Telugu Site icon

Manda Krishna Madiga: సీఎం చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ

Manda Krishna Madiga

Manda Krishna Madiga

Manda Krishna Madiga: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై సీఎంతో చర్చించారు. మందకృష్ణ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ మొదలుపెట్టి వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గంట పాటు మాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు సీఎం చంద్రబాబు ముందుకొచ్చారన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధమే అని 7 గురు జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్ తీర్పునిచ్చిందన్నారు.
తమిళనాడు ఇచ్చిన చట్టాన్నే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఇచ్చారని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ వేశారని చెప్పారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ జాప్యం లేకుండా మరింత వేగవంతంగా చేయాలన్నారు. ఆరు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ అమలుకు సిద్ధంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఒక కమిషన్ వేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారని.. కమిషన్ రిపోర్టు వచ్చి వర్గీకరణ జరిగే వరకూ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశామన్నారు. కమిషన్ రిపోర్టు వచ్చే వరకూ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వనని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తీసుకున్న లెక్కలు ఇప్పుడు మారాయన్నారు.

Read Also: Ambati Rambabu: హోంమంత్రి కాకపోతే సీఎం అవ్వు.. పవన్‌పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

2011 లెక్కలు పరిగణనలోకి తీసుకుని 15 నుంచి నెల రోజుల్లోనే నివేదిక వచ్చేలా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అన్ని నియామకాలలో మాదిగల భాగస్వామ్యం ఉండాలని కోరామని మందకృష్ణ వెల్లడించారు. గతంలో 33 వినతులు సీఎం చంద్రబాబుకు ఇచ్చామన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు స్తంభాలైతే నాల్గవ స్తంభం ఎంఆర్పీఎస్ పని చేసి గెలుపు బాటలో నిలబెట్టిందన్నారు. కూటమి గెలుపులో ఎంఆర్పీఎస్ శ్రేణులు కూడా బలంగా పని చేశారన్నారు. మొన్నటి గెలుపుకు పని చేసిన నాలుగు శక్తులు కారణం… దానిలో మూడు శక్తులు ప్రభుత్వంలో ఉన్నాయన్నారు. మేం ప్రభుత్వంలో భాగస్వాములం కాకపోయినా ఫలితం మా బిడ్డలకు దక్కాలన్నారు. మాదిగలు సంతృప్తి పడేలా భాగస్వామ్యం ఉండేలా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.

పవన్ కామెంట్స్‌పై మంద కృష్ణ మాదిగ స్పందించారు. పవన్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. మీ అభిప్రాయం ఎలా ఉన్నా.. లోపల మాట్లాడాలని.. దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై మాట్లాడటం దురదృష్టకరమన్నారు. హోంమంత్రిని అంటే ప్రభుత్వాన్ని, సీఎంను అన్నట్టేనన్నారు. హోంమంత్రిని అనడమే కాదు.. సీఎంను కూడా పవన్ అన్నట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే పవన్‌ను వ్యతిరేకించామన్నారు. మాలలకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు ఇవ్వని పవన్ సామాజిక న్యాయం గురించి ఎలా మాట్లాడతాడని ప్రశ్నించారు.జనసేన అంటే కమ్మ, కాపు ఓట్లతో మాత్రమే గెలవలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి ఇవ్వనపుడు ఇదేం సామాజిక న్యాయమని ప్రశ్నించారు. మాట్లాడే సమయం వచ్చినపుడు మేం అన్ని విషయాలు మాట్లాడతామన్నారు. కేబినెట్ అంటే కుటుంబమని.. పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టం.. మా కులానికి అవమానమని వ్యాఖ్యానించారు. రేపు పవన్ మాటలు ఆయన శాఖకు కూడా వర్తిస్తాయన్నారు మందకృష్ణ మాదిగ.