Man Stabs Daughter: గుజరాత్‌లోని సూరత్‌లో దారుణం జరిగింది. కనిపెంచిన కన్నతండ్రే కన్నకూతురి పాలిట కాలయముడయ్యాడు. కూతురిని 25 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హత్యచేశాడు. ఇంట్లో తగాదాల కారణంగా తన కుమార్తెను కత్తితో 25 సార్లు పొడిచి చంపి, అతని భార్యను గాయపరిచినందుకు సూరత్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మే 18వ తేదీ రాత్రి సూరత్‌లోని కడోదర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామానుజ అనే దుండగుడు తన కుటుంబంతో కలిసి సూరత్‌లోని సత్య నగర్ సొసైటీలో అద్దెకు ఉంటున్నాడు. విచారణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తమ కుమార్తె టెర్రస్‌పై పడుకున్న విషయంపై భార్యతో జరిగిన చిన్నపాటి వాదనలో నిందితుడు సహనం కోల్పోయాడు. పరిస్థితి తీవ్రమై హింసకు దారితీసింది. సుమారు రాత్రి 11.20 గంటలకు, రామానుజు మొదట తన పిల్లల ముందే తన భార్యపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న పిల్లలు అడ్డుకోబోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన రామానుజ.. కూతురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కూతురిని 25 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Read Also: BJP: రాహుల్ గాంధీలోకి “జిన్నా” ఆత్మ ప్రవేశిస్తుంది.. అమెరికా ప్రసంగంపై బీజేపీ విమర్శలు..
తన కుమార్తెపై ఘోరమైన దాడి జరిగిన తర్వాత కూడా, రామానుజు తన భార్యకు హాని చేయాలని నిశ్చయించుకుని డాబాపైకి ఎక్కాడు. తమ తల్లిని రక్షించడానికి సాహసోపేతమైన ప్రయత్నంలో, పిల్లలు జోక్యం చేసుకోగా.. రామానుజ దాడికి కూతురు బలి అయింది. దీంతో సూరత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అధికారులు వేగంగా రామానుజను పట్టుకున్నారు. హత్యాయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై హత్య, హత్యాయత్నం సహా ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఆర్‌కే పటేల్ తెలిపారు.విచారణ కొనసాగుతుండగా, అధికారులు బాధితురాలు, ఫిర్యాదుదారు రేఖ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. గాయపడిన వారు మరోవైపు చికిత్స పొందుతున్నారు.