మైనర్ బాలికని అత్యాచారం చేసి గర్భవతిని చేసిన నేరస్తునికి నల్గొండ జిల్లా సెషన్స్ కోర్టు 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2012లో జరిగిన ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరిచించింది. 2012 డిసెంబర్ నల్గొండ శివారులోని ఆర్జాల బావి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నిజాముద్దీన్ అలియాస్ నిజ్జు (36) అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగు చూసింది. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపి.. సాక్షాదారాలను పూర్తిగా పరిశీలించిన నల్గొండ జిల్లా మొదటి అదనపు సెషన్ కోర్టు నిందితుడిపై నేరారోపణ రుజువైనట్టు ప్రకటిస్తూ 60 సంవత్సరల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
ఇండియన్ పీనల్ కోడ్‌లోని చిన్న పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం ప్రకారం ఒక్కో సెక్షన్ కింద 20 సంవత్సరాలు పాటు మొత్తం 60 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. 2012 డిసెంబర్ లో నల్గొండ రూరల్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై నల్గొండ రూరల్ ఎస్సై కంచర్ల భాస్కర్ రెడ్డి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అప్పటి సీఐ చంద్రశేఖర్ రెడ్డికి దర్యాప్తు అప్పగించారు. వారిద్దరు కలిసి పకడ్బందీ ఆధారాలతో, పూర్తిస్థాయి దర్యాప్తును అన్ని సాంకేతిక ఆధారాలతో కోర్టు ముందు కేసు యొక్క అభియోగ పత్రము దాఖలు చేశారు.
ఈ కేసు విచారణను నల్గొండ జిల్లా మొదటి అదనపు సెషన్ జడ్జి కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ సిరిగిరి వెంకటరెడ్డి విజయవంతంగా నిర్వహించడంతో నేరస్థుడు నిజాముద్దీన్ కు గరిష్టంగా శిక్ష పడింది. అదే విధంగా అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు పది లక్షల రూపాయల నష్టపరిహార చెల్లింపుకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు నల్గొండ పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మొత్తన్ని బాలిక భవిష్యత్ కొరకు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుందని, ఇది కాకుండా నేరస్తునికి అదనంగా మరో అరవై వేల రూపాయల జరిమానా విధించి అట్టి జరిమానాలను బాధిత బాలికకు అందజేసే విధంగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే నేరస్తుడికి 60 సంవత్సరాల జైలు శిక్షను ఏకకాలంలోనే 20 సంవత్సరాలు జైల్లో నిర్భంధించేలా కోర్టు తీర్పు వెలువరించింది.