Gun Firing: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో పది రూపాయల సిగరెట్ ఇవ్వలేదన్న కారణంతో ఒక వ్యక్తి దుకాణంపై గన్‌ఫైరింగ్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన గ్వాలియర్ మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనారాయణ్ బజార్ లో మే 16వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలోని ప్రధాన నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేసి, సంఘటన స్థలంలో సీన్ రీక్రియేట్ చేశారు.
Read Also: Yuzvendra Chahal: ముంబైకి చుక్కలే.. వచ్చేస్తున్న స్పిన్ మాంత్రికుడు..?
దేవనారాయణ్ బజార్‌లో ఉన్న సురజీత్ మావై అనే వ్యక్తికి చెందిన కిరాణా దుకాణానికి ప్రధాన నిందితుడు ఆదిత్య భదౌరియా మే 16వ తేదీ సాయంత్రం బైక్‌పై వచ్చి సిగరెట్ అడిగాడు. అప్పటికే ఉన్న రూ. 250 అప్పును గుర్తు చేసాడు సురజీత్. ఆ తర్వాత ఆ బాకీ తీర్చాలని చెప్పి, అతడు అడిగిన సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో తీవ్ర అసహనం చెందిన ఆదిత్య అక్కడినుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన అతను అదే రాత్రి 11 గంటల సమయంలో, ఆదిత్య భదౌరియా మరో ఇద్దరు వ్యక్తులు ఛోటూ భదౌరియా, అమన్లతో కలిసి బైక్‌పై వచ్చి సురజీత్ దుకాణం వద్ద ఇష్టానుసారం గొడవకు దిగారు. అనంతరం ముగ్గురు కలిసి దుకాణంపై 15 రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సురజీత్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
Read Also: IPL 2025 Qualifier 2: ముంబై vs పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డుకాబోతుందా.. అయితే ఫైనల్ చేరుకునేది ఎవరు?
ఈ ఘటన మొత్తం దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఛోటూ భదౌరియా, అమన్‌ను పోలీసులు ముందే అరెస్ట్ చేశారు. తాజాగా ప్రధాన నిందితుడు ఆదిత్య భదౌరియాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం, అతడిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేశారు. అంతేకాకుండా అతన్ని పోలీసులు నగరంలో నది రోడ్డుపై తిప్పారు. ఇది ప్రస్తుతం గ్వాలియర్ నగర ప్రజల్లో చర్చనీయాంశమైంది.