ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు స్టార్ అయిపోవచ్చు. ఇక ఫాలోవర్లు అధికంగా ఉంటే.. ప్రమోషన్లతో బోలెడంత డబ్బు సంపాదించ్చు. అందుకే చాలా మంది వైరైటీగా వీడియోలు, రీల్స్ చేయాలని చూస్తున్నారు. అయితే ఆ వైరైటీనే ప్రాణాలు కోల్పోయేలా చేస్తోంది. తాజాగా ఓ యువకుడు ఫేమ్, మనీ కోసం.. ఏకంగా నాగుపామును నోట్లో పెట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మోచి గంగారాం పాములను పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గంగారాం కుమారుడు శివరాజు కూడా తండ్రి లానే పాములను పడుతుంటాడు. తాజాగా గంగారాం భారీ నాగుపామును పట్టుకున్నాడు. తాను, తన కుమారుడు ఫేమస్ అయ్యేందుకు గంగారాం ఓ ప్లాన్ వేశాడు. పాము తలను నోట్లో పెట్టుకుని వీడియో తీసి.. వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయమని కుమారుడు శివరాజుకు చెప్పాడు.
Also Read: Airtel Festive Offers: పండగవేళ ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్.. సెప్టెంబర్ 11 వరకు మాత్రమే!
తండ్రి చెప్పాడని శివరాజు పామును నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకునే సమయంలో పాము ఆ యువకుడిని కాటేసింది. నాగుపాము కాటేసినా కూడా.. శివరాజు దాని తలను నోట్లో పెట్టుకుని రోడ్డుపై వీడియోలకు పోజులిచ్చాడు. పాముకాటు గురైన శివరాజు.. కొద్దిసేపటికే మృత్యువాత పడ్డాడు. దాంతో గంగారాం కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివరాజు పామును నోట్లో పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రాణాలు పోతున్నాయ్.. ఇలాంటి రీల్స్ అవసరమా? అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.