సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకంలో తేడా రావడంతో ఇండియా కూటమితో విభేదించిన ఆమె ప్రస్తుతం ఆ కూటమికి జై కొట్టారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో తాను ముఖ్య పాత్ర పోషించానన్నారు. కూటమి పేరు కూడా తానే పెట్టానని చెప్పారు.
READ MORE: AP Elections 2024: నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ.. హింసాత్మక ఘటనలపై రిపోర్ట్..!
పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “బీజేపీ పార్టీ దొంగలతో నిండి ఉంది. 400 సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోంది. కానీ అది జరగదని ప్రజలు అంటున్నారు. బీజేపీ నిండా దొంగలే ఉన్నారని.. దేశం మొత్తం అర్థం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మేం (టీఎంసీ) బయటి నుంచి ఇండియా కూటమికి మద్దతు ఇస్తాం. (పశ్చిమ) బెంగాల్‌లో మా తల్లులు, సోదరీమణులు ఎన్నటికీ సమస్యలు ఎదుర్కోకుండా, 100 రోజుల ఉపాధి పథకంలో పని చేసే వారికి కూడా మేము సహాయం చేస్తాం, ”అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసత్వ (సవరణ) చట్టాన్ని (సీఏఏ) రద్దు చేస్తామని, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ), యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలును నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో నాలుగు దశల ఓటింగ్ పూర్తయి మూడు దశల ఓటింగ్ మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో మమత ఈ ప్రకటన చేయడం విశేషం. బెంగాల్‌లో ప్రతి దశలోనూ ఓటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఐదవ దశలో (మే 20), బంగావ్, బరాక్‌పూర్, హౌరా, ఉలుబెరియా, శ్రీరాంపూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లలో ఓటింగ్ జరగనుండగా, ఆరో దశలో (మే 25) ఓటింగ్ తమ్లుక్, కంఠి, ఘటల్, ఝార్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, విష్ణాపూర్ లో పోలింగ్ జరగనుంది.