Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!

  • కోల్‌కతా హైకోర్టులో న్యాయవాది దుస్తుల్లో హాజరైన మమతా బెనర్జీ
  • నల్ల లాయర్ గౌన్‌లో కనిపించిన మాజీ సీఎం ఫొటోలు వైరల్
  • అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసు విచారణలో కోర్టు హాజరు
  • రాజకీయ కార్యకర్తలపై దాడుల ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు..
Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ (Mamata Banerjee) నేడు కోల్‌కతా హైకోర్టులో న్యాయవాది దుస్తుల్లో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నల్లని లాయర్ గౌన్ ధరించి కోర్టుకు వచ్చిన ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఆమె కోర్టుకు హాజరయ్యారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికిన ఆ ఎన్నికల తర్వాత రాజకీయ కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది. సీనియర్ టీఎంసీ నేత, న్యాయవాది కళ్యాణ్ బనెర్జీ కుమారుడు శీర్షణ్య బందోపాధ్యాయ ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు సమాచారం. ఎన్నికల అనంతరం పలువురు కార్యకర్తలు లక్ష్యంగా మారారని, రాజకీయ ప్రతీకార చర్యలు జరిగాయని పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా అల్ ఇండియా త్రిణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదిక Xలో స్పందించింది. బెంగాల్ ప్రజలకు అవసరమైన సమయంలో మమతా బెనర్జీ ఎప్పుడూ అండగా నిలుస్తారని.. నిజం, న్యాయం, రాజ్యాంగ విలువల కోసం ఆమె పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పార్టీ పేర్కొంది. అలాగే ద్వేష రాజకీయాలకు అతీతంగా ఆమె కరుణ, ధైర్యం, నిబద్ధతతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించింది. బీజేపీ అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె ఎప్పటికప్పుడు పోరాడుతున్నారని కూడా పార్టీ తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిశీలనలో ఉండగా, రాబోయే రోజుల్లో మరిన్ని విచారణలు జరగనున్నాయి. కోల్‌కతా హైకోర్టు ఈ ఆరోపణలపై తదుపరి విచారణ చేపట్టనుంది.