మణిపూర్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి దశ భారత్ జోడో యాత్ర ద్వారా భారత్ దేశాన్ని ఏక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. దేశంలోని ముఖ్య సమస్యలు, మణిపూర్ లో జరిగిన అల్లర్లపై సమాధానం కోరిన ప్రతిపక్షాలను సభ నుండి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకున్నారన్నారు మల్లు రవి. అంతేకాకుండా.. ప్రజా సమస్యలను అడగకుండా, ప్రశ్నించకుండా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలను ఈయాత్ర ద్వారా ప్రజలలోకి తీసుకెళతున్నారని ఆయన తెలిపారు. పెట్టుబడులను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లారని, ముప్పై రోజుల పాలన ప్రజారాంజకంగా సాగిందన్నారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి సిద్దంగా ఉందని, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఓటమి ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కొల్లాపూర్ లో కేటీఆర్ తప్పుడు సమాచారం తో అబద్దాలు మాట్లాడిండని, వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన హత్యను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తుండ్రు అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ పార్లమెంటు ఎన్నికల తర్వాత కూలిపోతుందని ప్రచారం చేస్తుండ్రు అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలువనుందని ఇలాంటి ప్రచారం చేస్తుండ్రు అని ఆయన తెలిపారు. రామ మందిరం బీజేపీ పార్టీ కార్యక్రమంలాగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని, రాముడు అందరివాడు.. కాంగ్రెస్ రామరాజ్యం లక్ష్యం గా పని చేస్తుందన్నారు. గాంధీ, ఇందిరా నుండి నేటి వరకు కాంగ్రెస్ ఆలోచనా విధానంతో ముందుకెళ్తుందని, రామ మందిర ప్రారంభం ఆహ్వానం ఉన్నా ట్రస్ట్ తో సంబంధం లేకుండా బిజెపి తన పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్నందునే వెళ్లలేక పోతున్నామని, రామ మందిరాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
