Site icon NTV Telugu

Bhatti Vikramarka : భారీ అప్పుల్లోనూ సంక్షేమానికి తడబాటులేదు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదాయం లేని పరిస్థితుల్లోనూ, అప్పులపై వడ్డీలు కట్టడం వంటి ఆర్థిక బాధ్యతలు వహిస్తూ సంక్షేమ పథకాలను నిలకడగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆరోపించారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఖాళీగా వదిలిందని విమర్శించారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నట్లు వెల్లడించారు.

Cyberabad Police: ఆదమరిస్తే అంతే సంగతులు.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూ.9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. జూన్ 2న లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన సిబిల్ స్కోర్పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తామని, నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.12,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా సంక్షేమం అమలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. త్వరలోనే ఇందిర సౌర గిరిజన వికాసం కింద ఆదివాసీ రైతులకు బోర్లు, సోలార్ పవర్ పంప్‌సెట్లు, డ్రిప్ వ్యవస్థలను అందజేస్తామని చెప్పారు. ఈ నెల 18న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు.

AP Govt: మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్‌.. ఏపీ ప్రభుత్వం కసరత్తు!

Exit mobile version