ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ముంబైకు తీసుకెళ్లారు. పోలీసుల కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను ముంబైకి తరలించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముంబై తీసుకెళ్లింది. బిభవ్.. సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి తన ఐఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫార్మాట్ చేసిన ఐఫోన్ లోని డేటాను సేకరించడానికి పోలీసులు ముంబైకి తీసుకెళ్లారు.
బిభవ్ కుమార్ కస్టడీ వచ్చే గురువారంతో ముగియనుంది. తమ విచారణలో తేలిన అంశాల ఆధారంగా ఆయన రిమాండ్‌ను పొడిగించమని కానీ, సెక్షన్ 201 విధించేందుకు అనుమతించమని కానీ కోర్టును పోలీసులు కోరే అవకాశం ఉంది. నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసే వ్యక్తులను శిక్షించేందుకు సెక్షన్ 201 నమోదు చేస్తారు.
మే 13న కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ కుమార్ దాడికి తెగబడ్డాడు. ఆమెను ఇష్టానురీతిగా హింసించి.. దాడికి పాల్పడ్డాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉండడంతో లోతుగా విచారిస్తున్నారు.
కేజ్రీవాల్ నివాసంలో కూర్చుని ఉండగా బిభవ్‌కుమార్ వచ్చి దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 7-8 సార్లు చెంపపై కొట్టాడని.. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడని తెలిపింది. పరిగెడుతుంటే చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడని ఆరోపించింది. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయానని.. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసినట్లు స్వాతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం పోలీసులు మాలివాల్‌ను కేజ్రీవాల్ నివాసానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.
ఇదిలా ఉంటే స్వాతి మలివాల్‌పై దాడి అంశంపై దర్యాప్తునకు ఢిల్లీ పోలీసులు తాజాగా సిట్‌ని ఏర్పాటు చేసింది. దీనికి నార్త్ ఢిల్లీ అడిషనల్ డిప్యూటరీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజిత చెప్యాల నేతృత్వం వహించనున్నారు. సిట్‌లో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారులను చేర్చారు. వీరిలో కేసు నమోదైన సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి కూడా ఉన్నారు.