హైదరాబాద్ మలక్‌పేటలో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. ఓలా బైక్‌పై వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత నిందితులు కారును అక్కడ ఆపకుండా పరారయ్యారు. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలవడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలిని డాక్టర్ శ్రావణిగా గుర్తించారు. అయితే ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఎన్టీవీతో ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య మాట్లాడుతూ.. రాత్రి 7 గంటలకు హస్తినాపురం నుండి మలక్‌పేట్ కు బైక్ బుక్ చేసుకున్నారని, 7 గంటలకు హస్తినాపురం నుండి శ్రావణిని ఎక్కించుకొని బైక్ పై బయలుదేరానని ఆయన వెల్లడించారు. ముసారంబాగ్ దాటిన తర్వాత ఒక కారు వచ్చి నా బైక్ ని ఢీ కొట్టింది. ఎడమవైపు నుండి ఓవర్ టేక్ చేస్తూ చాలా స్పీడ్ డ్రైవింగ్ తో ఢీకొట్టారు. దీంతో ఇద్దరం బైక్ పై నుంచి కింద పడ్డాము.
నాకు హెల్మెట్ ఉంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను. శ్రావణికి హెల్మెట్ లేకపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంబులెన్స్ రావడం ఆలస్యం అవుతుందని అక్కడ ఉన్న స్థానికలే కారులో యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి కావడంతో కారు నెంబరు కారుని గుర్తించలేకపోయాను. కానీ కారు మాత్రం రెడ్ కలర్ లో ఉందని వెంకటయ్య వెల్లడించారు.