London: లండన్లో గాంధీ జయంతి వేడుకలు జరగడానికి కొన్ని రోజుల ముందు మహాత్ముడికి అవమానం జరిగింది. టావిస్టాక్ స్క్వేర్లో సోమవారం నాడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనను భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. దీనిని “సిగ్గుచేటు చర్య”, అహింస వారసత్వంపై దాడిగా అభివర్ణించింది. ‘లండన్లోని టావిస్టాక్ స్క్వేర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన చర్య సిగ్గుచేటు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అహింసా దినోత్సవానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం విధ్వంసం మాత్రమే కాదు. మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నాం’ అని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
READ ALSO: Visakhapatnam: అసలే వివాహేతర బంధం.. అందులోనూ మళ్లీ పోటీ.. కత్తిపోట్లతో దద్దరిల్లిన విశాఖ..
కళాకారిణి ఫ్రెడ్డా బ్రిలియంట్ చెక్కిన గాంధీ కాంస్య విగ్రహాన్ని 1968లో లండన్ యూనివర్సిటీ సమీపంలో స్క్వేర్ వద్ద ఆవిష్కరించారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్లో మహాత్మా గాంధీ న్యాయ విద్యార్థిగా ఉన్న రోజులకు నివాళిగా దానిని అక్కడ ఆవిష్కరించారు. మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నామని మెట్రోపాలిటన్ పోలీసులు, స్థానిక కామ్డెన్ కౌన్సిల్ అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించిన గాంధీ జయంతిని ప్రతి ఏడాది అక్టోబర్ 2న లండన్లోని స్మారక చిహ్నం వద్ద ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున అక్కడ జాతిపితకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తారు.
READ ALSO: North Korea: అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు.. అమెరికాకు గట్టి దెబ్బే!