Maharashtra: ఓటరుగా నమోదుపై యువతలో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో ప్రవేశాలను ఓటు హక్కుతో ముడిపెట్టాలని నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు తమ ఓటరు నమోదును తప్పనిసరి చేస్తుందని రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. గురువారం ముంబయిలోని రాజ్‌భవన్‌లో జరిగిన వ్యవసాయేతర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల సమావేశంలో రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) ప్రకారం ప్రభుత్వం జూన్ 2023 నుంచి నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతుందని చెప్పారు. ఎన్‌ఈపీ పాలసీ ప్రకారం విశ్వవిద్యాలయాలు నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
ఎన్‌ఈపీ ప్రకారం నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను జూన్ నుంచి అమలు చేయాల్సి ఉంటుందని, అలా చేయడంలో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినందున యూనివర్సిటీలకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. జాతీయ విద్యావిధానం అమలులో వైస్ ఛాన్సలర్ల ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం త్వరలో రిటైర్డ్ వైస్-ఛాన్సలర్ల కమిటీని ఏర్పాటు చేస్తుందని చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. రాష్ట్ర ఉన్నత విద్యావ్యవస్థలో చదువుతున్న 50 లక్షల మంది విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, కేవలం 32 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు కోసం ముందుకొచ్చారు. దీంతో యూనివర్సిటీలు, కాలేజీలలో అడ్మిషన్ కావాలంటే ఓటు హక్కు ఉండాల్సిందేనని రూల్ తెచ్చారు.
NASA: విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన నాసా అంతరిక్ష నౌక.. వీడియో ఇదిగో..
ఎన్‌రోల్‌మెంట్ శాతాన్ని మెరుగుపరచడానికి విశ్వవిద్యాలయాలు ప్రచారం నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు. మాతృభాషలో విద్యను అందించడం, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి జాతీయ విద్యా విధానం సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు విశ్వవిద్యాలయాలను ‘ఆత్మనిర్భర్’ (స్వయం సమృద్ధిగా) మార్చాలని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ.. మహారాష్ట్రలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్‌లకు పిలుపునిచ్చారు.
చాలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సెల్ఫ్ ఫైనాన్స్, దూరవిద్య కార్యక్రమాల ద్వారా బాగా పని చేస్తున్నాయని ఆయన అన్నారు. జాతీయ విద్యావిధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి విశ్వవిద్యాలయాలు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్, జాతీయ విద్యా విధానం సంస్కృతి, భారతీయ విజ్ఞాన వ్యవస్థపై పెద్దపీట వేస్తుందని అన్నారు. యూనివర్సిటీల్లో ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంపై సలహాలు ఇచ్చేందుకు అంకితభావంతో పనిచేసే అధికారులు, ప్రొఫెసర్లు, యువకులు, రిసోర్స్ పర్సన్లతో కూడిన చిన్న సలహా కమిటీలను ఏర్పాటు చేయాలని వైస్ ఛాన్సలర్లను కోరారు.