మహబుబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్దం అయింది. నేడు ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ సరళి కొనసాగనుంది. ఇక, ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా తమ ఓటు హక్కును స్థానిక సంస్థల ఓటర్లు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు.
Read Also: Fire accident: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. పెద్దెతున ఎగిసిపడుతున్న మంటలు..!
ఇక, కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో తన ఎక్స్ అఫిషియో ఓటును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినియోగించుకోనున్నారు. మహబుబ్ నగర్, వనపర్తి, గద్వాల, కొడంగల్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్ నగర్ లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసుల బందోబస్తు,144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ టీంల ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించనున్నారు.