Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జన నాయగన్’ సినిమా యూనిట్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో ‘జన నాయగన్’ సినిమా విడుదలపై తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది హైకోర్టు.
Yash Toxic Teaser: యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతున్న యష్ టాక్సిక్.. 24 గంటల్లో !
వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అవసరమైన మార్పులు చేసిన అనంతరం సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి CBFCను ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమాపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించడం “ప్రమాదకర ధోరణి” అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన CBFC సినిమాలో సాయుధ దళాలకు సంబంధించిన చిహ్నాలు (Armed Forces Emblems) ఉన్నాయని, అవి నిపుణుల కమిటీ ద్వారా సమీక్షించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. అలాగే రివైజింగ్ కమిటీతో మరోసారి చిత్రాన్ని పరిశీలించాలని కోరుతూ తక్షణ విచారణ కూడా అభ్యర్థించింది. తాజా విచారణ అనంతరం కోర్టు జనవరి 21 వరకు ‘జన నాయగన్’ సినిమా విడుదల చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా యూనిట్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే జనవరి 9న సినిమా నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాల వల్ల జనవరి 9న విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ను వాయిదా వేస్తున్నాం. ప్రేక్షకుల ప్రేమ, ఓపికే మా బలం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం అని వారు పేర్కొన్నారు. ‘జన నాయగన్’ చిత్రం విజయ్ రాజకీయాల్లో పూర్తిగా అడుగుపెట్టే ముందు ఆయన చివరి సినిమా. ఈ కారణంగానే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ కోర్టు ఆదేశాలతో ఇప్పుడు సినిమా భవితవ్యం జనవరి 21 విచారణపై ఆధారపడి ఉంది. ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా నెలకొంది.