పచ్చని కాపురంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ చిచ్చుపెట్టింది. భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్న భర్త.. ఆమె ముందే ప్రియుడికి దేహశుద్ధి చేశాడు. భార్యతో మాట్లాడుతున్న ప్రియుడిపై ఆమె భర్త, అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది. మదనపల్లె రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్ర శేఖర్ (20)కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వివాహిత పరిచయం అయింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఇంద్ర శనివారం వివాహితకు ఫోన్ చేసి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పిలిపించుకుని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఆమె భర్త, అతని అనుచరులు ఆసుపత్రి వద్దకు వచ్చారు. చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్న వీరిద్దరినీ గుర్తించి.. రాళ్లతో దాడి చేశారు. ఆపై ఇంద్రను చితకబాదారు. దాడిలో ఇంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, స్థానికులు అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న మదనపల్లె రెండో పట్టణ పోలీసులు హటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. గాయపడిన ఇంద్ర నుంచి వివరాలు సేకరించారు. గత కొంతకాలంగా ఇంద్రతో తన భార్య చనువుగా తిరుగుతోందని, ఆమె మొబైల్ కి అతడు మెసేజెస్ పెట్టినట్లు మహిళ భర్త తెలిపారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేయి విచారణ చేస్తున్నారు.