Lizard in mouth kills child in Chhattisgarh: నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో సోమవారం (జులై 24) ఉదయం చోటుచేసుకుంది. బల్లి నోట్లో పడిన సమయంలో బాలుడు గాఢ నిద్రలో ఉన్నాడు. బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని జంతు నిపుణులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి…
కోర్బా జిల్లా నాగిన్‌భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ సందే అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు. వీరిలో చిన్నవాడైన జగదీశ్‌కు రెండున్నరేళ్లు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో జగదీశ్ మంచంపై నిద్రిస్తున్నాడు. ఇంటి పనులు చేసుకుంటున్న జగదీశ్ తల్లి.. అతడిని కాసేపు గమనించలేదు. కొద్ది సమయం తర్వాత జగదీశ్‌ను దగ్గరికి వెళ్లి చూడగా.. నోట్లో బల్లి కనిపించింది. ఆందోళనకు గురైన తల్లి పెద్దగా కేకలు వేసింది. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వారు ఇంట్లోకి వచ్చి చూడగా.. నోట్లో ఉన్న బల్లితో పాటు జగదీశ్ కూడా మృతి చెందాడు.
Also Read: IND vs WI 2nd Test: భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా.. సిరీస్ 1-0తో రోహిత్ సేన సొంతం!
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని జగదీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని జంతుశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరాం కుర్రే అంటున్నారు. ‘బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదు. బల్లి నోట్లో పడడం వల్ల శ్వాశ ఆడక చనిపోయే అవకాశం ఉంది. పోస్టుమార్టం ఫలితాలు వస్తేనే బాలుడి మరణానికి గల అసలు కారణం తెలుస్తుంది’ అని కుర్రే అన్నారు.