viral news: ఇళ్లలో పిల్లలు మారాం చేస్తుంటే ఒక్కోసారి కోపం వచ్చినా చాలా సార్లు సరదాగా అనిపిస్తుంటుంది. అన్నం తినమంటే తిననని కొందరు, బడికి వెళ్లమంటే వెళ్లనని కొందరు మారాం చేయడం మామూలే. ఏదైనా చెబితే చేసేందుకు వారు చెప్పే సాకులు చూస్తుంటే భలేగా ఉంటుంది. వారి ముద్దు ముద్దు మాటలు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇక చిన్నతనంలో వారిని బడికి తీసుకుపోవాలంటే తల్లిదండ్రులు చిన్న పాటి యుద్ధం చేయాల్సిందే. తీరా వారిని స్కూల్ దాకా తీసుకెళ్లినా.. తిన్నగా కూర్చుంటారా అంటే నాన్న చేతినో.. అమ్మ చేతినో వదిలి ఉంటారా.. నువ్వు ఉండాలి అంటూ ఏడుస్తుంటారు. మనలో చాలమంది చిన్నప్పుడు చాక్లెట్ కొనిస్తేనో లేదా బిస్కెట్ ఇస్తేనో బడిలో కూర్చుని పాఠాలు చదివిన వాళ్లమే అనుకోండి.
Read also: jio phone: అదిరిపోయే ఫీచర్లతో జియో 5జీ స్మార్ట్ ఫోన్
ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ? ఇక్కడో చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత సేపు చదవాలి ఇంకా చదివి చదివి ముసలాడిని అయ్యేలా ఉన్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నేడు నెట్లో హల్ చల్ చేస్తోంది. ఓ చిన్నారి.. సుమారు నాలుగేళ్లు ఉంటాయి. చేతిలో పుస్తకం, పెన్సిల్ పట్టుకుని కూర్చుంటాడు. అతడిని చదవాలని తల్లి చెప్తుంటే.. బుంగమూతి పెట్టుకుని తాను చదవబోనని మారాం చేస్తుంటాడు. ఎందుకు చదవవు, ఏమైంది అని అడిగితే.. ‘‘ఎంత సేపు చదవాలి. జీవితాంతం చదివీ, చదివీ ముసలాడిని అయిపోయేలా ఉన్నాను (జిందగీ భర్ పడాయి కర్తే కర్తే బుడ్డా హో జావూంగా..) ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియోను గుల్జార్ సాహబ్ అనే యూజర్ ట్విట్టర్ లో పెట్టగా వైరల్ గా మారింది. ఐదు లక్షలకుపైగా వ్యూస్ రాగా.. వేల కొద్దీ లైకులు, కామెంట్లు వస్తున్నాయి. చదువు మీద పిల్లాడు చెప్పిన విషయం విని ‘మంచి పాయింటే చెప్పాడు’ అని కొందరు అంటుంటే.. ‘చదవకుంటే ఎట్లా మరి’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ‘‘పిల్లాడు ముద్దుముద్దుగా చెప్తున్న విషయం వింటుంటే నవ్వకుండా ఉండలేకపోతున్నాం” అని ఇంకొందరు పేర్కొంటున్నారు. ‘‘పిల్లలు ఆటాడుకుంటూ నేర్చుకునేలా ఉంటే మారాం చేయరు. వారు చేసిన కొద్దీ, నేర్చుకున్న కొద్దీ మెచ్చుకుంటూ ఉంటే మారాం చేయకుండా చేస్తారు..” అని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.