హుజూరాబాద్ఉపఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. రేపు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడింటి వరకు పోలింగ్ జరగనుంది. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నందన పోలింగ్ సమయాన్ని కూడా పెంచారు. మొత్తం 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2లక్షల 37వేల 36 మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. వీరిలో పురుషులు లక్షా 17వేల 933 మంది, మహిళలు లక్షా 19వేల 102 మంది ఉన్నారు. కరోనా సోకిన వారు సైతం సాయంత్రం సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. వారికి పీపీఈ కిట్లు కూడా సమకూర్చనుంది.
పోలింగ్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేట్టారు. 3వేల 865 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో 20 కంపెనీల కేంద్ర బలగాలు, 74 మంది ప్రత్యేక పోలీసులు, 700 మంది కరీంనగర్ జిల్లా పోలీసులు, 14 వందల 71 మంది ఇతర జిల్లాల పోలీసులు ఉన్నారు. అయితే.. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మందుబాబులకు షాక్ తగిలింది. గురువారం అంటే నిన్నసాయంత్రం నుంచి 30 వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మూసివేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 28 వ తారీఖు సాయంత్రం నుంచి వైన్ షాపులు, రెస్టారెంట్లు మరియు మద్యం డిపోలు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.