Wife Door-Delivers Husband’s Dead Body: స్విగ్గీ, జుమాటో డెలివరీ చేసినంత ఈజీగా భర్త డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసింది ఆ ఇల్లాలు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన నంద్యాల జిల్లా నూనెపల్లిలో జరిగింది. భర్త వేరే యువతితో సంబధం పెట్టుకున్నాడనే కారణంతో పుట్టింటికి పిలిపించి మరీ హత్య చేయించింది. ఆ తర్వాత ఏకంగా కారులోనే తీసుకు వచ్చి డెడ్‌బాడీని డోర్ డెలివరీ చేసింది. ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రమణ. ఆయనకు 20 ఏళ్ల క్రితం పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో వివాహమైంది. వారికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. పెయింటర్‌గా పని చేస్తున్న రమణ.. దాదాపు 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని.. ఆమె మోజులో పడి డబ్బు మొత్తం ఖర్చు చేస్తున్నాడని అనుమానించేది రమణమ్మ. దీంతో ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. భర్త రమణ పీడను వదిలించుకోవడానికి యాసిడ్ పోసి హత్య చేయడానికి ప్లాన్ చేసింది రమణమ్మ. కానీ కూతురు లక్ష్మికి ఈ విషయం తెలియడంతో తండ్రిని అప్రమత్తం చేసింది. దీంతో ఆ ప్లాన్ బెడిసి కొట్టింది.
READ MORE: Bolisetty Srinivas: ఈడీ కేసుల్లో జగన్ అరెస్ట్ ఖాయం.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
కానీ ఈసారి గొడవ పెట్టుకుని నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది రమణమ్మ. భార్యాభర్తల మధ్య గొడవలను నివారించేందుకు ఇద్దరి మధ్య సర్ది చెప్పాల్సిన రమణమ్మ పుట్టింటి వారు మరింత ఆజ్యం పోశారు. రమణ అడ్డు తొలగించుకోవడానికి సోదరుడు రామయ్య కూడా తొడయ్యాడు. అక్క, సోదరుడు కలసి రమణ హత్యకు ప్లాన్ చేశారు. దీంతో అప్పటి వరకు భర్తతో ఫోన్ మాట్లాడని రమణమ్మ.. నైస్‌గా అతన్ని పిడుగురాళ్లకు పిలిపించుకుంది. అక్కడ తమ్ముడి సాయంతో కళ్లలో కారం కొట్టి దారుణంగా హత్య చేయించింది. తర్వాత ఏమి ఎరుగనట్లు మృతదేహాన్ని భర్త సొంతూరుకి పంపి డోర్ డెలివరీ చేసింది. రమణ కిందపడి చనిపోయినట్టు చెప్పి లేని దుఃఖాన్ని నటిస్తూ ఏడ్చింది. మృతదేహంపై ఉన్న దెబ్బలు.. కారంపోడి మరకలను చూసి కూతురు లక్ష్మీకి అనుమానం వచ్చింది. తల్లిని నిలదీసింది. తల్లి ఒప్పుకోకపోవడంతో నంద్యాల త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లక్ష్మీ. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హత్య చేసినట్టు అంగీకరించింది రమణమ్మ. నంద్యాల పోలీసులు.. హత్య విషయాన్ని పిడుగురాళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పిడుగురాళ్ల పోలీసులు నంద్యాలకు చేరుకొని రమణమ్మను అదుపులోకి తీసుకున్నారు..