NTV Telugu Site icon

Telangana Assembly Elections 2023: ముహూర్త బలం.. భారీగా నామినేషన్లు..

Nominations

Nominations

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు పలువురు.. ఇవాళ ముహూర్తం బాగుండటంతో.. ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీబాస్‌ కేసీఆర్ ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్‌లో రెండు సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. కామారెడ్డిలో ఆర్డీవో కార్యాలయంలో కేసీఆర్‌ నామినేషన్ వేశారు. నామినేషన్ తర్వాత ప్రచారం వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేటలో నామినేషన్‌ దాఖలు చేశారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో హరీశ్‌రావు, సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో కేటీఆర్‌ నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. బోధన్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థి షకీల్‌ నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత కాసేపు బైక్‌ ప్రయాణించి సందడి చేశారు.

సీఎల్పీనేత భట్టి విక్రమార్క.. మధిరలో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయాన్నే వివిధ మతపెద్దల ఆశీర్వచనాలు తీసుకున్న సీఎల్పీనేత.. ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరారు. అభిమానులు, కార్యకర్తలు వెంట రాగా భట్టి విక్రమార్క.. నామినేషన్ వేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి నామినేషన్‌ వేశారు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి. భారీ ర్యాలీగా రిటర్నింగ్‌ కార్యాలయానికి వెళ్లి.. నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్‌లో నామినేషన్ వేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి బరిలోకి దిగుతున్న ఆయన.. స్థానిక నేతలతో కలిసి వెళ్లి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మల్లారెడ్డి, వివేకానంద, సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, వరంగల్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కత్తిదాడితో పది రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్‌రెడ్డి.. అంబులెన్స్‌లో దుబ్బాక వెళ్లి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. వీల్‌చైర్‌లోని రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానానికి మర్రి రాజశేఖర్‌ రెడ్డి బీఆర్ఎస్‌ తరపున నామినేషన్‌ వేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

సూర్యాపేట జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రేపటితో పార్టీ గడువు ముగియనుండడం.. కాంగ్రెస్ తరపున అభ్యర్థిని ప్రకటించకపోవడంతో.. ఆ పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు.. పటేల్ రమేష్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీలతో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు నేతలు. ఇద్దరు నేతలు పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేయడంతో.. ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి అవుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Show comments