NTV Telugu Site icon

Bihar political crisis: నితీష్‌కు చెక్ పెట్టేందుకు లాలూ మాస్టర్ ప్లాన్!

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav

బీహార్‌ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఆర్జేడీ అప్రమత్తమైంది. మహాకూటమి నుంచి బయటకు రావాలని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తీసుకున్న నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ఆర్జేడీ కసరత్తు ప్రారంభించింది. దెబ్బకు దెబ్బ కొట్టేందుకు పార్టీ నేతలతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యనేతలతో కలిసి మేథోమదనం చేస్తున్నారు. బీహార్‌లో తమకే ఎక్కువ మెజార్టీ ఉందని లాలూ ప్రసాద్ అన్నారు. చిన్న పార్టీలతో కలిసి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ అధినేత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ తమకే ఉందని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు మీడియాకు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంటకు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఆర్జేడీ నేతలంతా సమావేశం అవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో లాలూ సమాలోచనలు చేయనున్నారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పూర్ణియాలో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నుంచి గట్టేందుకు ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు.

Read Also: Kejriwal: బీజేపీ కుట్ర.. మా ఎమ్మెల్యేలను కొనేందుకే నన్ను అరెస్ట్ చేస్తారటా..?

బీహార్‌లో ప్రస్తుతం ఇలా..
బీహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. కనీస మెజార్టీకి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78కి, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16, హెచ్‌ఏఎం(ఎస్)కు నలుగురు, ఎంఐఎంకు ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాలు ఆర్జేడీతో కలిసే ఉన్నాయి. ఈ మూడు పార్టీల బలం 114 మంది ఉన్నారు. మెజార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. జేడీయూ-బీజేపీ చేతులు కలిపితే మాత్రం 123 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయి. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ తమకే ఉందని ఆర్జేడీ అంటుంది. బీహార్‌లో చోటుచేసుకున్న ఈ సంక్షోభం ఎలా ముగుస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.