Lalchand Rajput: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతున్నా, హిట్ మ్యాన్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోహిత్ మరో రెండేళ్ల పాటు హాయిగా ఆడగలడని, ప్రస్తుతం అతను ఎదుర్కొంటున్న ఇబ్బందులు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ వల్ల వచ్చే సహజమైన అలసట మాత్రమేనని అతని తొలి కోచ్, గురువు లాల్‌చంద్ రాజ్‌పుత్ నొక్కి చెప్పారు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ లేడంటూ వచ్చిన వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కొట్టిపారేసిన నేపథ్యంలో రాజ్‌పుత్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ రోజుల్లోనే రోహిత్ ప్రతిభను చూసిన రాజ్‌పుత్, హిట్ మ్యాన్ ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రోహిత్ తన ఫిట్‌నెస్‌పై చాలా కష్టపడ్డాడని, ఇప్పుడు మరింత స్లిమ్‌గా మారాడని ప్రశంసించారు. గత మ్యాచ్‌లోనే రోహిత్ తన పాత ఆటను గుర్తుచేశాడని, కేవలం ఒక్క పెద్ద ఇన్నింగ్స్ వస్తే చాలు మళ్లీ మునుపటి ఫామ్‌లోకి వచ్చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం అనవసరమని, రోహిత్ కూడా 2027 వరకు ఆడాలనే పట్టుదలతోనే ఉన్నాడని చెప్పుకొచ్చారు.
ఇక ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ ఫామ్ గురించి మాట్లాడుతూ, ఇన్ని ఏళ్లు ఆడాక గాయాలు, అలసట సహజమేనని, కానీ ప్రతిసారి రోహిత్ మరింత బలంగా పునరాగమనం చేశాడని గుర్తుచేశారు. ఇప్పుడు ఒకే ఫార్మాట్‌పై దృష్టి పెడుతున్నందున రోహిత్ బ్యాటింగ్ శైలి కూడా మారిందని, గతంలోలా కాకుండా ఇప్పుడు ఇన్నింగ్స్‌ను నిలకడగా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడని, త్వరలోనే సెంచరీ మార్కును అందుకుంటాడని రాజ్‌పుత్ ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్, విరాట్ కోహ్లీల ఉనికి జట్టుకు ఎంతో బలమని, మైదానంలో వీరిద్దరి ఆరా చూసి ప్రత్యర్థులు సైతం భయపడతారని, యువ ఆటగాళ్లకు వీరిద్దరే రోల్ మోడల్స్ అని కొనియాడారు.

