New Zealand thrash South Africa by 281 runs: బే ఓవల్‌లోని మౌంట్ మౌంగనుయి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ విజయాన్ని అందుకుంది. 281 పరుగుల తేడాతో కివీస్ రికార్డు విజయం సాధించింది. టెస్ట్ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్‌కు ఇదే పెద్ద విజయం. 1994లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో కివీస్ 137 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది. ఇక దక్షిణాఫ్రికాపై తొలి సిరీస్ విజయానికి ఒక అడుగు దూరంలో కివీస్ ఉంది. 1931 నుంచి దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్ గెలవలేదు.
కైల్ జేమీసన్ నాలుగు వికెట్స్ పడగొట్టడంతో తొలి టెస్టులో మరో రోజు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాపై 281 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. జేమీసన్ సహా మిచెల్ సాంట్నర్ చెలరేగడంతో 528 పరుగుల భారీ ఛేదనలో ప్రొటీస్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో డేవిడ్ బెడింగన్ (87) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడాడు. రేనార్డ్ వాన్ టోండర్ (31), జుబేర్ హంజా (36), రువాన్ డి స్వర్డ్ (34) పరుగులు చేశారు.
Also Read: SAT20 League 2024: బార్ట్‌మన్ సంచలన బౌలింగ్.. ఫైనల్ చేరిన సన్‌రైజర్స్!
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 366 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్సులతో 240 రన్స్ చేశాడు. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (118) సెంచరీ బాదాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 162 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ చేసిన 45 పరుగులే టాప్ స్కోర్. మాట్ హెన్రి, సాంట్నర్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ (109) మరో సెంచరీ చేయగా.. 179 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 247 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్ భారీ విజయాన్ని అందుకుంది. రచిన్ రవీంద్ర(కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో కివీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.