Site icon NTV Telugu

Bandi Ramesh: కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు బాండ్‌ పేపర్‌ రాయడానికి కూడా రెడీ..

Bandi Ramesh

Bandi Ramesh

Bandi Ramesh: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ నాలుగో ఫేస్‌లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ ఇంటికి ఓటు అడగడానికి వెళ్లినా కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని, హారతులు పడుతున్నారని, రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం కాంగ్రెస్‌లో కనిపిస్తుందని, కొంతమంది మభ్యపెట్టి, భయపెట్టి, బలహీనం చేసి ఏదో సాధించాలని చూస్తున్నారని కానీ అది సాధ్యపడదన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉందని, మీకు కూడా దమ్ము, ధైర్యం వుంటే ప్రజల్లోకి వెళ్లాలన్నారు. కాంగ్రెస్ 6గ్యారంటీలకు బాండ్ పేపర్ రాస్తామని, శివుడి ముందు వుంచి 6 గ్యారంటీలకు దేవుని ముందు వుంచి ప్రమాణం చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఇవన్నీ చేయడానికి దైర్యం కావాలని.. మేము చేసేదే చెప్తామన్నారు. పదేళ్లలో కూకట్‌పల్లికి ఒక్క కాలేజ్ అయినా వచ్చిందా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను ఆయన అభ్యర్ధించారు. గొట్టుముక్కల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. బండి రమేష్ బాగా చదువుకున్న వ్యక్తి , సౌమ్యుడు, 16 గంటలు ప్రజలకు సేవ చేస్తారని, ఆయనకు అందరూ ఓటువేసి గెలిపించాలని అన్నారు.. ఈ సమావేశంలో బండి రమేష్ సతీమణి లకుమాదేవి, రాజేష్ గౌడ్, నేతి శ్రీధర్, శ్యామ్ సుందర్ ,అందే శ్రీరామ్‌మూర్తి , బాలాజీ, దినేష్ పాల్గొన్నారు.

Read Also: Revanth Reddy: పటాన్‌చెరులో పదేళ్లుగా బీఆర్ఎస్ రౌడీయిజం నడుస్తోంది..

అనంతరం కేపీహెచ్‌బీలోని ఇండిస్ వన్ సిటీ, లోదా మెరిడియన్ రెసిడెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ ‘మార్పుమొదలైంది.. మీ తీర్పుమిగిలింది..’ కార్యక్రమంలో బండి రమేష్‌ పాల్గొన్నారు. మా సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని.. బండి రమేష్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని రెసిడెంట్స్ వెల్ఫేర్ సభ్యులు తెలిపారు, ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ లోదా, వన్ సిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సభ్యులు తనకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. తాను గెలిచిన అనంతరం కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను, అసోసియేషన్‌కు సంబందించిన ఎలాంటివి అయినా తీరుస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ముందుంటానని అన్నారు.

Exit mobile version