KTR: కేసీఆర్ పార్టీ పెట్టిననాడు సినిమా స్టార్ కాదు.. రాజకీయ నాయకులంటే టైమ్ పాస్‌కి వాడుకుంటారని అనుకునే రోజుల్లో పార్టీని నడిపారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా ఆయన అంబర్‌పేట్‌లో కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు.. హైదరాబాద్‌లో జెండా పట్టే వాళ్ళు లేకుండే.. ఇవాళ సైన్యం తయారు అయ్యిందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణని అవమానించిన వాళ్లకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ పార్లమెంట్‌లో లేదన్నారు. దిక్కు మాలిన కాంగ్రెస్‌ని మూసీలో కలపాలని విమర్శించారు. రైతుల కన్నీళ్ల నుంచి నెత్తురు కారుతుందని ఆరోపించారు. జూన్‌లో తమ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైందని.. జూలైలో కమిటీలు వేసుకుందామని తెలిపారు. జూన్ 15 తరువాత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకుందామని చెప్పారు. కార్పొరేటర్ కావాలని అనుకునే వాళ్ళు ప్రజల్లో ఉంటారో వారికే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ప్రజల మధ్యలో ఉండే నాయకులకు టికెట్ ఇస్తామని.. మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలన్నారు. ప్రభుత్వం పై ప్రజలకు పీకల వరకు కోపం ఉందని.. కాంగ్రెస్ కి వారం రోజులు ఐతే 50 శాతం కాలం అయిపోతుంది.. ఒక్క ఇల్లు కూడా కాంగ్రెస్ కట్టలేదని విమర్శించారు.
శనివారం ఆదివారం వస్తే హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కులగొడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. “రేవంత్ రెడ్డికి ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు కానీ ప్యూచర్ సిటీ అంటున్నారు. న్యూయార్క్ లా ఫ్యూచర్ సిటీ అంటున్నారు.. ఎవరి కోసం కడతారు. మూసీ మూసీ అని ముఖ్యమంత్రి మురుస్తున్నారు. ఇక నిన్న కేబినెట్ మీటింగ్‌లో ధాన్యంపై కనీసం చర్చ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్స్ పెడతారట.. ట్రాన్స్ఫార్మర్స్ వద్ద మీటర్స్ పెడతారట.. మోడీ తాన అనగానే రేవంత్ రెడ్డి తందాన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫ్యూజ్‌లు పీకాలి. అదానీ, అంబానీ మనుషులు మీ ఇంటికి వస్తారు. మోటార్స్ వద్ద మీటర్లు వద్దు అని కేసీఆర్ ముందే కేంద్రానికి చెప్పారు. ఉచిత విద్యుత్ రద్దు కోసమే కాంగ్రెస్ మోటార్స్ వద్ద మీటర్లు అంటుంది. డిసెంబర కార్పొరేషన్ ఎన్నిక ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకొక సంవత్సరం తట్టుకుంటే మళ్ళీ మనదే అధికారం. భూములు ధరలు మళ్ళీ పెరుగుతాయి. మళ్ళీ గులాబీ జెండా ఎగురాలే.” అని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
