KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!

Ktr

Ktr

KTR: హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి స్వాతంత్య్ర ఉద్యమం తరహాలో గొప్ప చరిత్ర ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 1968 నుంచి ప్రారంభమైన ఉద్యమం అనేక దశల్లో కొనసాగిందని.. వేలాది మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని అణచివేసిందని ఆరోపించారు.

2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారని, 2004లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుందని తెలిపారు. పదేళ్లపాటు సాగిన ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోయారని, కేసీఆర్ పట్టుదల, దీక్ష కారణంగానే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. “సచ్చుడో తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు నడిపారని, ఆ సమయంలో తెలంగాణ సమాజం మొత్తం ఆయన వెనుక నిలిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రూపురేఖలను పూర్తిగా మార్చేశారని చెప్పారు.

×
×
Ad

కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఆర్థిక విప్లవం జరిగిందని, సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, వైద్య రంగ అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. దేశంలోనే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన అభివృద్ధికి సమానంగా మరో రాష్ట్రం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ లేదా బీజేపీ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం అసత్యమని ఆయన అన్నారు. అధికారం కోల్పోయినందుకు తమకు బాధ లేదని.. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న ఆకాంక్షలు నెరవేరకపోవడం బాధ కలిగిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు.

“రైజింగ్ తెలంగాణ” అంటున్నారు.. కానీ విధానాలు చూస్తే “ఫాలింగ్ తెలంగాణలా” ఉన్నాయి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనా కంటే కాంగ్రెస్ పాలన ప్రమాదకరమని ప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరును జపించడం తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. భూముల వేలం ద్వారా వేల కోట్లు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశంలో ఎక్కడా లేని రైతు డిస్కంను తెలంగాణలో తీసుకురావాలనే ఆలోచన రైతులకు నష్టదాయకమని అన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ రంగానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.