Koti Deepotsavam 2024 Day 12: కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రధమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది. కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో 12వ రోజు మార్మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులయ్యారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2024లో నేటితో 12 రోజులు విజయవంతంగా ముగిశాయి.
కార్తీక బుధవారం వేళ ఈరోజు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. పూజ్యశ్రీ విద్యాశంకర భారతి మహాస్వామీజీ, శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. బ్రహ్మశ్రీ డా.బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ప్రవచనామృతం వినిపించారు. వేదికపై బాసర సరస్వతీదేవి మహాపూజ ఘనంగా జరిగింది. భక్తులచే జ్ఞానప్రదాయిని సరస్వతి పుస్తక పూజ చేయించారు. వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వర ఆది దంపతుల కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి తరించిపోయారు. ఆదిదంపతులు సింహవాహనంపై భక్తులను అనుగ్రహించారు. చివరలో లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనంతో 12వ రోజు కోటి దీపోత్సవం వైభవంగా ముగిసింది.