శోభా యాత్రలతో భారతదేశంలో సంస్కృతీ, సాంప్రదాయాలు పెంపొందడంతో పాటూ దేశ భక్తి కూడా పెరుగుతుందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ లో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ..చేవెళ్ల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. యువతలో భక్తి భావం పెరగడం దేశ ఐక్యతకు చిహ్నమన్నారు. 15 ఏళ్లుగా శంషాబాద్ లో శోభాయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభినందించారు. అయితే, ఓ వైపు యువకుల్లో భక్తి భావం పెరుగుతుండగా.. కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హనుమాన్ గుడిని కూల్చి వేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: Jagga Reddy: ఇందిరమ్మకు ఉన్న చరిత్ర.. మోడీ, అమిత్ షాలకు ఉందా?
ఇక, దేశంలో కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోడీకీ, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని కొండా సంగీతారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్ లో ఆమె తన భర్త, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ.. మరోసారి నరేంద్రమోడీని ప్రధానిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందన్నారు. మోడీ ఆర్థిక విధానాలు, సంస్కరణల ఫలితంగానే దేశం ఇవాళ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో ఎదిగిందని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడానికి మోడీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేవెళ్లను అభివృద్ధి పథంలో నడిపించొచ్చని కొండా సంగీతారెడ్డి సూచించారు.