జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్ కోసం బుధవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణకు రాగా.. ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విధుల నుంచి తొలగించబడిన సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చాం అని పోలీసులు చెప్పగా.. మీరు నిజంగా పోలీసులు కాదేమో అంటూ మంత్రి కుమార్తె సుశ్మిత వాగ్వాదంకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ బయటకు రాగానే జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆపై మీడియా రాగానే మంత్రి సురేఖ కారులో వెళ్లిపోయారు.
మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విధుల నుంచి తొలగించింది. సుమంత్‌పై పలు అవినీతి ఆరోపణలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. విధుల నుంచి తొలగించిన అనంతరం సుమంత్ కోసం వరంగల్ పోలీసులు గాలిస్తున్నారు. మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నాడనే సమాచారంతో బుధవారం రాత్రి వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురు వచ్చారు. అయితే మఫ్టీలో వచ్చిన పోలీసులతో మంత్రి కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. పోలీసులను సుస్మిత గేటు వద్దే అడ్డుకున్నారు. మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ గొడవపడ్డారు. సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
విషయం మీడియాకు తెలియడంతో మంత్రి కొండా సురేఖ ఇంటికి చేరుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘సుమంత్ ఓఎస్టీ అయినా బాధ్యతలు లేవు. మా కుటుంబాన్ని వేదించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. డక్కన్ సిమెంట్స్ వివాదం నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, వెంకట నరేందర్ రెడ్డి, రోహిణి రెడ్డి కుట్ర చేశారు. అందరూ అమ్మను టార్గెట్ చేశారు. అమ్మను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది. రోహిణి రెడ్డిని విచారించకుండా మా తండ్రిపైనే కేసు ఎందుకు?. బీసీ మంత్రిని తొక్కే ప్రయత్నం పార్టీలో జరుగుతోంది. నా తండ్రికి ప్రాణభయం ఉంది’ అని సుశ్మిత ఆరోపణలు చేశారు.