వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కడియం కావ్య పేరును కొద్దిసేపట్లో కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఆమె వెల్లడించారు. ఇవాళ మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. పొలం భాట కార్యక్రమం పేరుతో కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని ఆమె ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకునెందుకు కేసీఆర్ ప్రయత్నమని ఆమె విమర్శించారు.
అంతేకాకుండా..’ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ కు కూడా రాని కేసీఆర్ కు ఇప్పుడు రైతులు గుర్తు రావడం విడ్డూరం. హీరోయిన్ ల ఫోన్లు ట్యాపింగ్ చేసిన కేటీఆర్ ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజల సొమ్ము అంతా నీటి పాలు చేశారు. నిపుణుల పర్యవేక్షణలో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కర్త కర్మ క్రియగా మారి నిర్మాణం చేయించాడు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం కడుగుతుంది. రేవంత్ రెడ్డి మీద మంచి మర్యాద లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. కవిత ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్ళింది. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం. అందుకే జైలుకు పోవడానికి ముందే రేవంత్ రెడ్డిని తిట్టాలని కేటీఆర్ చూస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ వెళ్లిన ఆశ్చర్యం లేదు’ అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.