ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తన ప్రతాపం చూపించింది. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చొల్లంగి నాగేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
బాధితుడు తన భూమికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని వీఆర్వో నాగేశ్వరరావును ఆశ్రయించాడు. అయితే.. చట్టబద్ధంగా జరగాల్సిన ఈ పనికి అధికారి లంచం డిమాండ్ చేశాడు. రూ. 16,500 ఇస్తేనే పని ముందుకు సాగుతుందని తెగేసి చెప్పడంతో, బాధితుడు చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళిక రచించిన ఏసీబీ అధికారులు, ర్యాలీలో వీఆర్వో నాగేశ్వరరావు బాధితుడి నుంచి రూ. 16,500 లంచం డబ్బులు తీసుకుంటుండగా అకస్మాత్తుగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద ఉన్న లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, రసాయన పరీక్షలు నిర్వహించి నేరాన్ని నిర్ధారించారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రభుత్వ సేవలు అందించేందుకు లంచం డిమాండ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో స్థానిక రెవెన్యూ శాఖలో తీవ్ర కలకలం రేగింది.

