అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలోని అంబాజీపేట, పి.గన్నవరం ప్రాంతాల్లో పోలీసులు ఏకకాలంలో నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీ మొత్తంలో అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలో మరోసారి రేషన్ మాఫియా కార్యకలాపాలపై చర్చకు దారితీసింది. పోలీసుల వివరాల ప్రకారం.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు అంబాజీపేట, పి.గన్నవరం ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బొలెరో వాహనాల్లో తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు.
అంబాజీపేటలో పట్టుబడిన ఒక బొలెరో వాహనంలో 44 బస్తాల రేషన్ బియ్యం లభించింది. మొత్తం సుమారు 2,200 కిలోల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ బియ్యం మలికిపురం, రాజోలు ప్రాంతాల నుంచి ఆలమూరు వైపు తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఇక రెండు వాహనాల్లో కలిపి మొత్తం 50 కిలోల చొప్పున 79 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పి.గన్నవరం సీఐ భీమరాజు తెలిపారు.
ప్రభుత్వం పేదల కోసం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి లాభాలు ఆర్జిస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో ఇటువంటి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కోనసీమ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది.
