NTV Telugu Site icon

Kolkata Doctor case: రంగంలోకి దిగిన సీబీఐ.. కోల్‌కతాకి ఢిల్లీ ప్రత్యేక బృందాలు

Dacoter

Dacoter

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మంగళవారం హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. హత్యాచార ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక వైద్య మరియు ఫోరెన్సిక్ బృందం రానుంది. ఉదయాన్నే బయల్దేరి కోల్‌కతా చేరుకోనుంది. తొలుత ఆర్‌జీ కర్ ఆస్పత్రిని సందర్శించి దర్యాప్తు చేపట్టనున్నారు.

గత శుక్రవారం ఉదయం డాక్టర్ సెమినార్ హాల్‌లో అర్ధనగ్నంగా శవమై పడి ఉంది. ఆమె బట్టలు చిందరవందరగా, ఆమె శరీరమంతా గాయాలయ్యాయి. అయినా కూడా ఆసుపత్రి  ప్రతిస్పందనలో తీవ్రమైన లోపాలను కోర్టు గుర్తించింది. సాక్ష్యాలను తారుమారు చేయకుండా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని కోరడంతో సీబీఐకి అప్పగించింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆధీనంలోని కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై న్యాయస్థానం తీవ్రంగా విరుచుకుపడింది. ప్రిన్సిపాల్ ‘ప్రోయాక్టివ్’ గా లేకపోవడం నిరుత్సాహపరుస్తుందని వ్యాఖ్యానించింది. మాజీ ప్రిన్సిపల్‌కు రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత మరో కళాశాలలో అదే పాత్రను అప్పగించడంపై కోర్టు ధ్వజమెత్తింది. వెంటనే అతనిని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపాలని ధర్మాసనం ఆదేశించింది. హత్యాచార ఘటన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన అవమానాన్ని భరించలేనని డాక్టర్ ఘోష్ రాజీనామా చేశారు. కొన్ని గంటల తర్వాత అతనికి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కొత్త పోస్టు ఇచ్చారు.

వైద్యురాలు హత్యాచారానికి గురైతే.. కుటుంబ సభ్యులకు ఆత్మహత్యగా ఎందుకు చెప్పారని కోర్టు నిలదీసింది. ఇక ఈ కేసులో ప్రిన్సిపాల్ స్టేట్‌మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని నిలదీసింది. అతడిని ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించింది. ఇందులో ఏదో తప్పు ఉందని కోర్టు పేర్కొంది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

ఇదిలా ఉంటే కేసును ఆదివారంలోపు కొలిక్కి తీసుకురాకపోతే సీబీఐకి అప్పగిస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే ప్రతిపక్షాలు కూడా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. మంగళవారం అనూహ్యంగా కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.