Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు

Prof Kodandaram

Prof Kodandaram

Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, తానూ అడగలేదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు కావాలని అడుగుతున్నామన్నారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నామన్నారు. ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని చెప్పారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఉద్యమ స్పూర్తితో ముందుకు పోయామన్నారు. ఎన్నికలు, పైసల విషయంలో వెనుకబడి ఉండొచ్చు.. కానీ తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు, అండగా ఉండటంలో ముందు ఉన్నామన్నారు. ప్రజలే మనకు ప్రమాణం.. ఉద్యమ ఆకర్షణే స్పూర్తితో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. మే12న పార్టీ ప్లీనరీ ఉంటుందని చెప్పారు. తెలంగాణలో మార్పు కోసం నైతిక శక్తిగా నిలబడదామన్నారు.

“చిన్న పార్టీ అని హేళన చేసిన ప్రజల పక్షాన నిలబడ్డాం. మనం చేసే పని నిజాయితిగా ఉండాలని పార్టీ పెట్టాం. ఎన్ని అటు పోట్లు అవహేళన చేసినా పార్టీ పెట్టి విజయవంతంగా పూర్తి చేసుకొన్నాం. నిరంకుశ పాలనను అంతమొందించాలని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాం. పైసలు ప్రధానం అయి పోతున్నాయి. రాజకీయాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. బెంగాల్‌లో విచ్చల విడిగా డబ్బులు పంచుతున్నారు. కేంద్రంలో SIRతో డబ్బులు కుమ్మరించి గెలవాలని చూస్తున్నారు.” అని కోదండరాం వ్యాఖ్యానించారు. ఇక గతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “గతంలో ఎవరినైనా కలవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఎవరి దగ్గరకైనా వెళ్ళాలంటే.. ఇంట్లోనే ఫోన్ పెట్టి జాగ్రత్తగా రమ్మని చెప్పేవాళ్ళు. భయం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపెట్టింది. అమరుల స్పూర్తి యాత్ర చేస్తామంటే కూడా గతంలో పర్మిషన్ ఇవ్వలేదు. ప్రజలకు దూరంగా ఉంటే ఏ పార్టీ బతకదు. కేసీఆర్ అందుకే బయటకి వస్తున్నారు. మేం సరిగ్గానే ఉన్నాం, ప్రజలే మారాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కుటుంబ లోపాలను కవిత బయట పెడుతుంది. పార్టీ అంటే కుటుంబమే అని కవిత చెప్పకనే చెబుతోంది.” అని ఆయన స్పష్టం చేశారు.