NTV Telugu Site icon

Kodali Nani: సీఎం జగన్‌పై దాడి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani

Kodali Nani

Kodali Nani: సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో, ఇప్పుడు దాడులు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు చెప్పారన్నారు. కులాన్మాదంతో ముదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు మాటలు విని సీఎం జగన్‌ను చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారంగా గురి చూసి కొట్టాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్ను వద్ద తగిలింది.. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారన్నారు.

Read Also: Purandeswari: సీఎం జగన్‌పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది..

దాడిని ఖండించాల్సిన పెద్దలు.. సంస్కారహీనంగా సీఎం జగనే తనపై దాడి చేయించుకున్నారని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన 9 సంస్థలు చేసిన సర్వేల్లో 125 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్తున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా ఏమీ చేయలేని కొందరు రాజకీయ నిరుద్యోగులు.. విజయవాడ నడిబొడ్డున కొన్ని వర్గాలతో కలిసి జగన్మోహన్ రెడ్డి పై దాడి చేశారన్నారు. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయడానికి ప్రయత్నం జరిగిందంటే.. దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారని ఆరోపించారు. ఎంతో పక్కాగా దాడి చేయబట్టే సీఎం జగన్‌కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలి ఆయన గాయపడ్డారన్నారు.

ప్రధాని, సీఎం స్థాయి వ్యక్తులు రోడ్ షోగా వెళ్లేటప్పుడు పగలైనా రాత్రయినా కరెంటు తీసేస్తారని.. ఆ విషయం సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియదా.. బస్సుపై ఆయన రోడ్ షోలు చేసినప్పుడు కరెంటు తీయలేదా అంటూ ప్రశ్నించారు. సీఎం జగనే కావాలని కరెంటు తీయించారని పిచ్చివాగుడులు వాగుతున్నారని మండిపడ్డారు. అధికారులపై యాక్షన్ తీసుకోవాలంటూ చంద్రబాబు 420 వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.