Tirupati Crime: తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌ల యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థి లోకేశ్‌ను మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థిగా గుర్తించారు. దాడి చేసిన యువకుడు కార్తిక్, యువతి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన కార్తిక్‌ను ఆస్పత్రికి తరలించారు.
Read Also: Betting At Munneru: రూ.2వేల పందెం కోసం మున్నేరులో దూకిన యువకుడి మృతదేహం లభ్యం
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మోహన్‌బాబు యూనివర్సిటీ విద్యార్థి లోకేశ్ ఓ యువతితో కలిసి స్థానిక పీజీఆర్ థియేటర్‌లో సినిమాకు వెళ్లాడు. కార్తిక్ అనే యువకుడు లోకేశ్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. కత్తితో దాడి చేసిన తరువాత కార్తీక్‌తో కలిసి యువతి పరారైంది. ఇద్దరు యువకులతో యువతి ప్రేమాయణం నడిపినట్లు సమాచారం. యువతి పక్కా ప్లాన్‌తో హత్యాయత్నం చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో లోకేశ్‌కు యువతే సినిమా టికెట్లు బుక్ చేసినట్లు తెలిసింది. పథకం ప్రకారమే కార్తిక్‌తో యువతి దాడి చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పరారైన ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన లోకేశ్‌ది ప్రకాశం జిల్లా గిద్దలూరు అని.. కత్తితో దాడి చేసిన కార్తిక్, యువతి ఇద్దరూ సూళ్లూరుపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.