NTV Telugu Site icon

Human Trafficking : వరంగల్‌లో కిలేడీ గ్యాంగ్ అరాచకాలు.. భయాందోళనలో తల్లిదండ్రులు

Human Trafficking

Human Trafficking

Human Trafficking : వరంగల్‌లో ఓ మహిళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కిలేడీ గ్యాంగ్ అమాయక బాలికలను టార్గెట్ చేస్తూ పాశవిక దుశ్చర్యలకు పాల్పడుతోంది. మత్తుమందులకు బానిసై, ఈజీ మనీ కోసం బలహీన స్థితిలో ఉన్న బాలికలను లొంగదీసే ఈ ముఠా ఘోరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆమె తనతో పాటు మరికొంత మందితో కలిసి గ్యాంగ్ ఏర్పరచుకుంది. కార్పొరేట్ పాఠశాలలు, సంపన్నుల కాలనీల వద్ద రెక్కీ నిర్వహిస్తూ, అమాయక బాలికలను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయం పెంచుకునేది. ఆపై, నమ్మకం కలిగించిన అనంతరం బయటకు వెళ్దామని చెప్పి కిడ్నాప్ చేసేది.

బాలికలను అపహరించిన తర్వాత మత్తుమందులు ఇచ్చి, ముఠాతో టచ్‌లో ఉన్న మానవ మృగాలకు అప్పగించేది. డ్రగ్స్ మత్తులో ఉన్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి, అనంతరం తిరిగి ఆమె వద్దకు అప్పగించేవారు. ఇలా తాను కిడ్నాప్ చేసిన బాలికలను వివిధ ప్రాంతాలకు తరలించి అకృత్యాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇటీవల మిల్స్ కాలనీలో ఓ బాలిక కిడ్నాప్ కావడంతో, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రెండ్రోజుల తర్వాత బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది. పోలీసుల విచారణలో, ఒక మహిళ పరిచయం పెంచుకుని బయటకు తీసుకెళ్లిందని, మత్తుమందు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదని బాలిక చెప్పింది. వైద్య పరీక్షల్లో ఆమెకు డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటన తల్లిదండ్రుల్లో తీవ్ర భయాన్ని రేపింది. ఒంటరిగా పిల్లలను పాఠశాలకు పంపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్‌ మాత్రమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి గ్యాంగ్‌లు మరెక్కడైనా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి నేరస్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Bharat Ane Nenu: మహేష్ బాబు ఫ్యాన్స్‌తోనే కామెడీనా?.. ఫైట్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో!