ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జీ7 సదస్సు కోసం ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు మోడీ ఇటలీ వెళ్లనున్నారు. కాగా.. ప్రధాని పర్యటనకు ముందు అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఫొటోలు బయటపడ్డాయి. ఈ ఫొటోల్లో గాంధీ విగ్రహం ధ్వంసం కావడంతోపాటు విగ్రహం కిందిభాగంలో ఖలిస్తానీ మద్దతు తెలుపుతున్న నినాదాలు కనిపిస్తున్నాయి.
READ MORE: Mangoes: రుచిలోనే కాదు, ఆరోగ్యం విషయంలోనూ మామిడి ‘నెంబర్ వన్’..
ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇటలీలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని భారత్ లేవనెత్తిందని, విగ్రహానికి ఇటలీ ప్రభుత్వం మరమ్మతులు చేసినట్లు విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఈ అంశంపై ఇటలీ అధికారులతో మాట్లాడామన్నారు. అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
కాగా.. ఈ సంవత్సరం G7 శిఖరాగ్ర సమావేశం ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో జరుగుతుంది. జీ7 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరుకానున్నారు. పీఎం మోడీ జూన్ 13 న ఇటలీకి బయలుదేరి జూన్ 14 సాయంత్రం తిరిగి వస్తారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మరియు ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్‌లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ప్రధానమంత్రి వెంట ఉంటుంది.