హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోడిపందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక అంశం ఒకటి బయటికొచ్చింది. గత రెండు సంవత్సరాలుగా పోచంపల్లి ఫామ్‌హౌస్‌లో నిత్యం కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 సంవత్సరాల్లో పందేల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నిర్వహించిన క్యాసినో, కోడిపందేల సమాచారం తెలుసుకొని పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకతో పలువురు జూదగాల్లు స్పాట్ నుండి పారిపోయారు. పారిపోయిన వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి కూడా ఉన్నాడు. జ్ఞానదేవ్ రెడ్డితో పాటు మరికొందరు ప్రముఖులు పారిపోయారు. పారిపోతూ సుమారు రూ.40 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. జ్ఞానదేవ రెడ్డితో పాటు మిగతా వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Also Read: NABARD State Focus Paper: వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలి: మంత్రి తుమ్మల
తొల్కట్ట ఫామ్‌హౌస్‌లో మంగళవారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో 64 మంది పట్టుబడ్డారు. ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌హౌస్‌ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని ఎమ్మెల్సీ పోచంపల్లి చెబుతున్న నేపథ్యంలో.. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నిన్న నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ తో పాటు సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద పోచంపల్లిపై కేసు నమోదు చేశారు.