Kesineni Swetha: తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు. ఏ గడపగడపకు వెళ్లినా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇక్కడి కొండ ప్రాంతం ప్రజలకు వాటర్ ట్యాంక్ నిర్మించి నీటి సమస్య లేకుండా వైస్సార్సీపీ ప్రభుత్వం చేసిందన్నారు. ఎంపీ నిధుల నుంచి కూడా సుమారు నలభై లక్ష రూపాయలతో ఇక్కడ రోడ్లు నిర్మించారన్నారు. జగనన్నను గెలిపించుకుంటాం.. ఎంపీగా కేశినేని నానిని గెలిపించుకుంటాం.. అది మా బాధ్యత అని ప్రజలు చెప్తున్నారన్నారు.
కేశినేని నాని గత పది సంవత్సరాల నుంచి రూ.8000 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని కేశినేని శ్వేత వెల్లడించారు. ఎయిర్ పోర్ట్, ఫ్లైఓవర్స్, హాస్పిటల్స్, టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి కేశినేని నాని అని ఆమె చెప్పారు. విజయవాడ కోసం నీతి, నిజాయితీతో కేశినేని నాని పనిచేశారన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు.. ప్రజలందరూ తప్పకుండా ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కేశినేని నానిని, ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్‌ని గెలిపించాలని కోరుకుంటున్నామని కేశినేని శ్వేత పేర్కొన్నారు. కేశినేని నాని విజయవాడ ప్రజలకు ఒక పెద్ద కొడుకు లాంటి వాడన్నారు. విజయవాడ ప్రాంతం కోసం పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని ఎంతో కృషి చేశారని కేశినేని శ్వేత తెలిపారు. కేశినేని భవన్ ద్వారా ఎప్పుడు పేద ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కేశినేని నాని అంటూ చెప్పుకొచ్చారు.