Kesineni Nani Vs Kesineni Chinni: బెజవాడ పార్లమెంట్ స్థానంలో ఈ సారి ఆసక్తికరమైన పోరు జరగనుంది.. లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా? అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అన్నదమ్ములు బరిలోకి దిగే అవకాశముందా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీకి గుడ్‌బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, ఆ తర్వాత కేశినేని నానిని విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్ జగన్.. మరోవైపు.. టీడీపీ అప్పటి నుంచి మరింత యాక్టివ్ అయ్యారు కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మూడో జాబితాలో.. బెజవాడ లోక్‌సభ నుంచి బరిలో దిగుతున్నారు కేశినేని చిన్ని.. దీంతో.. బెజవాడలో అన్నదమ్ముల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.
Read Also: INDIA alliance: చీలిపోతున్న భారత కూటమికి కేజ్రీవాల్ అరెస్ట్‌తో బూస్టింగ్..
మొత్తంగా బెజవాడ పార్లమెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. కేశినేని బ్రదర్స్ మధ్య పోటీగా మారింది బెజవాడ పార్లమెంట్ సీటు.. బెజవాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కేశినేని నాని.. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వరుసగా రెండుసార్లు గెలిచారు కేశినేని నాని.. ఈసారి వైసీపీ నుంచి బెజవాడ ఎంపీగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు.. కానీ, తొలిసారి టీడీపీ నుంచి ఎంపీగా పోటీకి వచ్చారు కేశినేని చిన్ని.. విజయవాడ లోక్‌సభ ఎన్నికల్లో అన్నదమ్ములు బరిలోకి దిగారు కాబట్టి హోరాహోరీ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో.. కుటుంబ వ్యవహారాల నుంచి రాజకీయాల వరకు అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధమే నడిచింది.. ఓ దశలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారడం.. ఇద్దరి మధ్యే ప్రధాన మైన పోటీ ఉండడంతో.. బెజవాడ పాలిటిక్స్ లో మరింత హీట్ పెరగడం ఖాయంగా తెలుస్తోంది.