మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో ఎట్టకేలకు న్యాయం వైపు తొలి అడుగు పడింది. ఎర్నాకుళం సెషన్స్ కోర్టు ఇటీవల ఈ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఈ సంచలన కేసులో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. న్యాయస్థానం వారికి ఏకంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు ఇచ్చిన ఈ కఠిన శిక్షపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కోర్టు తీర్పు వెలువడిన వెంటనే బాధిత నటి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
Also Read : Dhurandhar : ‘ధురంధర్’ తెలుగు రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..?
తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ అందరి మనసులను కదిలించింది.. ‘గత 8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధాకరమైన ప్రయాణం తర్వాత ఇప్పుడే కాస్త ఉపశమనం కలిగినట్టు ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా ఆమె ఎదుర్కొన్న మానసిక వేదన, న్యాయం కోసం చేసిన నిరంతర పోరాటం ఈ పోస్ట్ ద్వారా స్పష్టంగా తెలియజేసింది. ఇక బాధిత నటి పోస్ట్‌కు మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వెంటనే మద్దతు తెలిపారు. ఆయన ఆ పోస్ట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, ఆమె ధైర్యాన్ని, పోరాటాన్ని గౌరవిస్తూ ‘ఫోల్డెడ్ హ్యాండ్స్’ అంటూ ఎమోజీ పెట్టాడు. ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న మద్దతును ఇది తెలియజేసింది. అలాగే, మరో ప్రముఖ నటి మంజు వారియర్ సైతం ఈ విషయంపై స్పందించారు. కోర్టు తీర్పుపై తనకు నమ్మకం ఉందని చెబుతూనే, ఈ కేసులో బాధితురాలికి పూర్తి స్థాయిలో న్యాయం దక్కలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి, కోర్టు తీర్పుతో దోషులకు శిక్ష పడి కొంత ఉపశమనం లభించినప్పటికీ, నటి న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉందని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.