ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు ప్రాంతాల నుంచి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్ లో టెర్రరిస్టుల మారణకాండ పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
READ MORE: MLC Election: నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక
కాగా.. జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో చోటుచేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
READ MORE: Pahalgam Terror Attack : పహల్గాం దాడి వెనక పాక్ కేంద్రంగా నడిచే ఉగ్రవాద సంస్థ..