కర్ణాటక అసెంబ్లీలో ఓ సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే వింత ప్రతిపాదన తీసుకొచ్చారు. పురుషులకు వారానికి రెండు బాటిళ్ల ఉచిత మద్యం ఇవ్వాలని జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అసెంబ్లీలో డిమాండ్ చేశారు. నేడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.36,500 కోట్ల నుంచి రూ.40,000 కోట్లకు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీనిని వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ దీని కోసం మళ్ళీ పన్నులు పెంచాల్సి ఉంటుంది. నేను మీకు కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. అభ్యంతరం చెప్పకండి. మద్యం ఖర్చుతో మీరు మహిళలకు నెలకు ₹2,000, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. వాళ్లని తాగనివ్వండి వాళ్లకి ఎలాగో మనం ప్రతీనెలా డబ్బులు కూడా ఇవ్వలేం కదా. కాబట్టి, మద్యం తాగే వారికి ప్రతి వారం రెండు వైన్ బాటిళ్లను ఉచితంగా ఇవ్వండి.” అని ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు.
అయితే, దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఇంధన మంత్రి కెజె జార్జ్ మాట్లాడుతూ.. మీరు ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, దీన్ని అమలు చేయండని అన్నారు. ప్రజలు మద్యం తక్కువ తాగేలా ప్రోత్సహించడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత బీఆర్‌పాటిల్ మాట్లాడుతూ మద్యాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఎక్సైజ్ రెవిన్యూ.. ఇది పాపిష్టి సొమ్ము. మనం పేదవారి రక్తాన్ని పిండి సంపాదిస్తున్న డబ్బు. దీనితో జాతి నిర్మాణం చేయలేం అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించే ఆలోచన చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. మహిళా శాసనసభ్యులు ఆయన ప్రకటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
READ MORE: New Liquor Brands : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంపు