రోడ్ల పై వాహనాలు వెళ్లేటప్పుడు అనుకోకుండా జంతువులు అడ్డు వస్తుంటాయి.. ఒక్కోసారి వాహనాల కిందపడి చనిపోతాయి.. కొన్నిసార్లు వాటివల్ల మనుషులకు ప్రమాదాలు జరుగుతుంటాయి.. ఇలాంటి ఘటనలను నిత్యం మనం చూస్తేనే ఉన్నాం.. తాజాగా తెలంగాణాలో మరో ఘటన జరిగింది.. ఓ కోతిని తప్పించబోయిన ఆటో డ్రైవర్ 13 మంది ప్రాణాలను రిస్క్ లో పెట్టాడు.. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.. మరో నలుగురి పరిస్థితి విషమంగా వుండగా మరికొందరు కూడా గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఇలా ఒక్క కోతి చాలామంది ప్రాణాలమీదకు తెచ్చింది..
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శివారులోని చింతల్ ఠాణాకు చెందిన మహిళా కూలీలు వరినాట్ల కోసం చందుర్తి మండలం మర్రిగడ్డకు వెళ్లారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఇలా 13మందితో ఆటో వేగంగా వెళుతుండగా ఊహించని ప్రమాదం జరిగింది.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ అడ్డంగా వచ్చింది.. ఆ కోతిని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. పల్టీలు కొడుతూ ఆటో బోల్తాపడటంతో అందులోని ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికుల ఆర్థనాదాలు, రక్తపు గాయాలు, చెల్లాచెదురుగా పడ్డ వస్తువులు, తుక్కుతుక్కయిన ఆటోతో ఆ ప్రాంతం అంత భయంకరంగా మారింది..
ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ధ మహిళలు ప్రాణాలను కోల్పోయారు.. నలుగురి పరిస్థితి విషమంగా వుందని… మిగతావారు కూడా గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురయినవారంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.. కోతి వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్దారించారు.. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..