Kangana Ranaut: రాజకీయ నాయకురాలుగా మారిన నటి కంగనా రనౌత్ తన వివాదాస్పద ప్రకటనలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, బుధవారం ఆమె మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొత్త వివాదం సృష్టించారు. అంతకుముందు, రైతుల ఉద్యమం మరియు ఉపసంహరించబడిన వ్యవసాయ చట్టాలపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమె విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా కంగన చేసిన పోస్ట్‌లో.. “దేశానికి జాతిపితలు ఎవరూ లేరు. కేవలం కుమారులు మాత్రమే ఉన్నారు. భారతమాతకు ఇలాంటి కుమారులు(లాల్ బహదూర్ శాస్త్రి) ఉండటం అదృష్టం” అని కంగన వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని ఉద్దేశపూర్వకంగా కంగన తక్కువ చేశారని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. మరో పోస్ట్‌లో, దేశంలో పరిశుభ్రతపై గాంధీజీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు.
Read Also: Divorce Case: కోర్టులో డివోర్స్ కేసు.. జడ్జిమెంట్ సమయంలో భార్యను ఎత్తుకెళ్లిన భర్త.. చివరకు?
కంగనా రనౌత్ పోస్ట్‌పై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే తీవ్రంగా మండిపడ్డారు. గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ ఎంపీ కంగనా వ్యంగ్యంగా కామెంట్ చేసింది. గాడ్సే ఆరాధకులు బాపు, శాస్త్రి మధ్య తేడాను చూపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ తన పార్టీ కొత్త గాడ్సే భక్తుడిని మనస్పూర్తిగా క్షమిస్తారా అంటూ ప్రశ్నించారు. పంజాబ్ బీజేపీ సీనియర్ నేత మనోరంజన్ కాలియా కూడా కంగనాను టార్గెట్ చేశారు. గాంధీజీ 155వ జయంతి సందర్భంగా కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో కాలియా తెలిపారు. తన రాజకీయ జీవితంలో వివాదాస్పద ప్రకటనలు చేయడం కంగనా అలవాటు చేసుకున్నారని ఆయన అన్నారు. రాజకీయం ఆమె రంగం కాదని.. రాజకీయం అనేది తీవ్రమైన అంశమని చెప్పారు. మాట్లాడే ముందు ఆలోచించాలన్నారు. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు.