బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంతా ఆమె అఫిడవిట్‌లో రూ.90 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే మూడు లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలిపారు.
ఆస్తులు..
రూ. 28.73 కోట్ల చరాస్తులు.. రూ.62.92 కోట్ల స్థిరాస్తులతో సహా మొత్తంగా రూ.90 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు నామినేషన్‌లో కంగనా వెల్లడించారు. ముంబై, పంజాబ్, మనాలిలో కొన్ని ఆస్తులు ఉన్నట్లుగా తెలిపారు. రూ.3.91 కోట్ల విలువైన మూడు లగ్జరీ కార్లు ఉన్నట్లు చెప్పారు. వీటిలో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, మెర్సిడెస్ మేబ్యాక్ సహా మరో మూడు కార్లు ఉన్నాయి. అలాగే, రూ.17.38 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేతిలో రూ.2 లక్షల నగదు ఉండగా.. రూ. 1.35 కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆభరణాలు…
రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల బంగారం, 60 కేజీల వెండి, రూ.3 కోట్ల విలువైన 14 క్యారెట్ల వజ్రాభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరుపై 50 ఎల్‌ఐసీ పాలసీలు ఉండగా.. వీటి విలువ రూ.7.3 కోట్లు. చండీగఢ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు తనపై ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. ఐదు విడత మే 20, ఆరు విడత 25, ఏడో విడత జూన్ 1న జరగనుంది. చివరి విడతలో కంగనా పోటీ చేస్తున్న మండీ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. విక్రమాదిత్య సింగ్ మొత్తం సంపద సుమారు రూ.96.70 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.